కోర్టులో ప్రవేశపెడితే.... ఆవరణలోనే మహిళల ఫోటోలు తీసిన పాస్టర్

SMTV Desk 2019-06-01 12:09:15  judge

ఓ కేసులో నిందితుడిగా పోలీసులు ఓ పాస్టర్‌ను కోర్టులో ప్రవేశపెడితే ఆవరణలోనే మహిళల ఫోటోలు తీసి అసభ్యంగా ప్రవర్తించిన పాస్టర్‌పై న్యాయమూర్తి మరింత ఆగ్రహానికి లోనయ్యారు. విజయ్ కుమార్ అనే ప్రభుత్వోద్యోగి తన అనారోగ్యం కారణంగా ఆరు నెలలుగా శాంసన్ అనే ఓ పాస్టర్ దగ్గర ప్రేయర్ చేయించుకుంటున్నారు.

శాంసన్ వద్దకు విజయ్ కుమార్ వెళ్లగానే మత్తు కలిగిన స్ప్రేను నోట్లో కొట్టి అతను స్పృహ కోల్పోయిన అనంతరం మొహం, చెంపలు, వీపుపై కొట్టేవాడు. కొంతకాలం తరువాత తన సమస్యలు తొలగకపోగా, కొత్తగా శారీరక సమస్యలు తలెత్తడంపై విజయ్‌కుమార్‌కు అనుమానం వచ్చింది.

దీంతో ఆయన ఈస్ట్ మారేడుపల్లి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే శాంసన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో ప్రవేశ పెట్టారు. అక్కడ కూడా శాంసన్ తన నిజస్వరూపాన్ని మరోమారు బయటపెట్టాడు. కోర్టుకు వివిధ సమస్యలపై వచ్చిన మహిళల ఫోటోలు తీశాడు. ఈ విషయమై అతనిపై మరో కేసు నమోదైంది. దీంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వెళితే తమపై లైంగిక వేధింపులకు శాంసన్ పాల్పడ్డాడని కొందరు మహిళలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని న్యాయమూర్తి తెలిపారు.