జగన్ కొత్త టీమ్‌పై క‌స‌ర‌త్తులు

SMTV Desk 2019-05-31 15:46:27  Jagan Cabinet,

ఏపీ ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యాన్ని సాధించి దేశం మొత్తం త‌న వైపు చూసేలా చేసుకున్న నేత వైఎస్ జ‌గ‌న్‌. ఈ నెల 30న అట్ట‌హాసంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌గ‌న్ అప్పుడే త‌న కొత్త టీమ్‌పై క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టారు. త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌బోతున్నారు. జూన్ 11 త‌రువాత మూడు రోజుల పాటు అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ లోపే క్యాబినెట్ విస్త‌ర‌ణ చేసే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ వున్న‌ట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 7న క్యాబినెట్ విస్త‌ర‌ణ వుంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగిన ఆ తేదీలో స్వ‌ల్ప మార్పు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

జూన్ 8న 15 మందితో మంత్రులుగా జ‌గ‌న్ ప్రమాణం చేయించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ టీమ్‌లో ఎవ‌రెవ‌రుంటార‌నేది మాత్రం ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. జ‌గ‌న్ క్యాబినెట్‌లో తొలిసారి మంత్రులుగా ప్ర‌మాణం చేయ‌బోయేది ఎవ‌ర‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే. శుక్ర‌వారం తాడేప‌ల్లి గూడెంలోరి త‌న నివాసంలో డీజీపి గౌతం స‌వాంగ్‌, సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంతో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శాంతి భ‌ద్ర‌త‌లతో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించార‌ని తెలిసింది. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన కొన్ని గంట‌ల్లోనే త‌న మార్కును చూపించ‌డం మొద‌లుపెట్టిన జ‌గ‌న్ ప‌లు కీల‌క శాఖ‌ల‌కు చెందిన అధికారుల్ని బ‌దిలీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో తండ్రి వైఎస్ కాలంలో అత్యంత విశ్వాసంగా మెలిగిన అధికారుల్ని నియ‌మించారు.