'గూఢచారి' సినిమా కంటే చాలా బాగుందట!!

SMTV Desk 2019-05-31 15:29:35  ajay, special

నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్పెషల్’. అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురికి ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోస్‌కి అద్భుతమైన స్పందన లభించిందని, చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రశంసించారని చిత్ర దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందమ్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ.. "స్పెషల్ సినిమాను జూన్ 14న భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది ఇది ఒక అద్భుతమైన సినిమా అని అన్నారు. ఇంతటి ఆశ్చర్యం కలిగించే సినిమా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది అని పదే పదే మెచ్చుకుంటున్నారు. ఇది చిన్న సినిమా అయినా కొంతకాలం క్రితం వచ్చిన గజిని, సెవెంత్ సెన్స్, చంద్రముఖి, అపరిచితుడు వంటి సినిమాలని గుర్తు చేసిందని మెచ్చుకున్నారు.

మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్‌ని రీడ్ చేయడం చాలా అద్భుతంగా ఉందని.... అజయ్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతని పెర్ఫార్మెన్స్ ఆశ్చర్యం కలిగించేలా ఉందనీ.. మిగిలిన పాత్రలు పోషించిన చాలా మంది కొత్త వాళ్లయినా సినిమాలో ఫీల్ అద్భుతంగా ఉందని అన్నారు. ఇది తెలుగులో చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సినిమా అని చూసిన వాళ్లందరూ మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఈ సినిమాని చూసిన శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బాపిరాజుగారు ఇది గూఢచారి సినిమా కంటే 4 రెట్లు బాగుందని చెప్పి పంపిణీ బాధ్యతలు తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, టీజర్స్, ప్రోమో సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇంత చిన్న బడ్జెట్‌లో ఇలాంటి సినిమా తీయగలగడం డైరెక్టర్ వాస్తవ్ ప్రతిభకు తార్కాణం. ఇతను ఫ్యూచర్‌లో చాలా పెద్ద సినిమాలు తీయగలడని అందరు భావించడం సినిమా టీమ్ మొత్తానికి చాలా ఆనందం కలిగిస్తోంది.." అని అన్నారు