ప్రపంచకప్‌లో విరాట్ బౌలింగ్!

SMTV Desk 2019-05-31 13:00:56  virat bowling in world cup 2019

ప్రపంచకప్ మెగా టోర్నీలో టీంఇండియా కాప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం కాసేపు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత బంతిని అందుకుని బౌలింగ్ చేశాడు. అదనపు బౌలర్ (ఆరో బౌలర్) స్థానంలో బ్యాట్స్‌మెన్‌ని తీసుకోవాలని ఆశిస్తున్న విరాట్ కోహ్లీ.. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే అవకాశం ఉంది. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకూ 227 వన్డేలాడిన విరాట్ కోహ్లీ.. కేవలం 48 మ్యాచ్‌ల్లో మాత్రమే బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఇంగ్లాండ్‌ పిచ్‌లకి అనుగుణంగా వరల్డ్‌కప్‌లో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో పాటు ఒక ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఒకవేళ అదనపు బౌలర్ అవసరమైతే..? కొన్ని ఓవర్లు తాను బౌలింగ్ చేయాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పేలవంగా ఓడిన భారత్ జట్టు.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై రెండో వార్మప్ మ్యాచ్‌లో పుంజుకుని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌పై నెం.4 స్థానంలో ఆడిన కేఎల్ రాహుల్ సెంచరీ సాధించిన నేపథ్యంలో.. అతడ్ని అదనపు బ్యాట్స్‌మెన్‌ రూపంలో తుది జట్టులో ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి.