స్మృతిఇరానీ ఖాతాలో మరో ఘనత...మంత్రి వర్గంలో ఆమే పిన్నవయస్కురాలు

SMTV Desk 2019-05-31 12:43:24  smriti irani

ఉత్తరప్రదేశ్‌లోని అమెథీ నియోజకవర్గంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై సంచలన విజయం సొంతం చేసుకున్న బీజేపీ నాయకురాలు స్మృతిఇరానీ మరో ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిన్న రెండోసారి కొలువుదీరిన కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కురాలు కూడా స్మృతిఇరానీయే. ఆమె వయసు 43 ఏళ్లు.

గత మంత్రి వర్గంలో అనుప్రియ పటేల్‌ (38) అత్యంత పిన్నవయస్కురాలు. ఈసారి మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. కాగా, మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో అత్యధిక వయసున్న వ్యక్తి రాంవిలాస్‌ పాశ్వాన్‌. పదహారవ లోక్‌సభలో మంత్రుల సగటు వయసు 62 సంవత్సరాలు కాగా పదిహేడవ లోక్‌సభలో ఇది 60 ఏళ్లకు తగ్గింది. ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన నరేంద్రమోదీ 65 ఏళ్లు దాటిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. అలాగే యాభై ఏళ్లలోపు ఉన్న వారు పలువురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.