నన్ను కాపాడండి: సౌదీ నుండి భారత మహిళ

SMTV Desk 2019-05-31 12:35:42  suahma swaraj

భర్త నుంచి ప్రాణ హాని ఉందని, తనను, ఆరుగురు పిల్లలను హైదరాబాద్‌కు పంపించాలంటూ సౌదీ అరేబియాలో చిక్కుకున్న ఓ మహిళ విదేశాంగ శాఖకు మొరపెట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన షయేమాబేగం వివాహం 15 ఏళ్ల క్రితం భోపాల్‌కు చెందిన మన్సూర్‌ దుర్రానితో జరిగింది.

మన్సూర్‌ దుర్రాని సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఓ కమర్షియల్‌ బ్యాంక్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు సోదరుడి సహాయంతో భోపాల్‌లో ఓ పాఠశాల నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తలు మన్సూర్‌, షయేమాబేగం ఆరుగురు పిల్లలతో సౌదీలోనే ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా అతడు భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమెను, పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడు.

అత్తింటివారు, మరిది కూడా వేధిస్తున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక మూడు వారాల క్రితం ఆమె తప్పించుకొని పిల్లలను తీసుకొని అదే నగరంలో తెలిసిన వారి ఇంట్లో ఉంటోంది. తనను, పిల్లలను చంపేస్తాడని సౌదీలోని భారత రాయబార కార్యాలయానికెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆమెతోపాటు పిల్లల పాస్‌పోర్టులు తీసుకురావాలని ఎంబసీ అధికారులు కోరారు.

పిల్లల పాస్‌పోర్టులు తండ్రి వద్దనే ఉన్నాయని, తమను ఇండియాకు పంపించనంటున్నాడని, కాపాడాలంటూ సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసింది. మన్సూర్‌కు గతంలో వివాహం అయిందని, అతడి వేధింపులు భరించలేక భార్య వదిలేసిందని లేఖలో పేర్కొంది. మొదటి భార్యకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయని, తాను ఇండియాకు వెళితే కేసు పెడతానని అడ్డుకుంటున్నాడని, తనను, పిల్లలను చంపేసే ప్రమాదం ఉందని, కాపాడాలని వేడుకుంటోంది.