జగన్ వయస్సు చిన్నది...బాధ్యతలు పెద్దవి: కేసీఆర్‌

SMTV Desk 2019-05-31 11:50:47  kcr, Jagan,

నేడు విజయవాడలో ఏపీ సిఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సిఎం కేసీఆర్‌, జగన్‌ను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్‌మోహన్‌రెడ్డి వయసులో చిన్నవాడు కానీ అతని ముందున్న బాధ్యతలు చాలా పెద్దవి. కానీ గత 9 ఏళ్లుగా అతనిలో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొని పోరాడే ధైర్యం, కష్టపడే గుణం, ప్రజలకు సేవ చేయాలనే తపనవంటి మంచి లక్షణాలను చూశాక ఏపీ ముఖ్యమంత్రిగా బాగా రాణించగలరనే నమ్మకం నాకు కలిగింది.

ఆయన తన తండ్రి పేరును నిలబెట్టేవిధంగా సమర్ధంగా పరిపాలన సాగించాలని, మరొక మూడు నాలుగుసార్లు ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. ఇదొక శుభదినం. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపై అందరూ చేతులు కలిపి పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగాలి.

ముఖ్యంగా కృష్ణా, గోదావరీ నదీ జలాలను సమర్ధంగా వినియోగించుకొంటూ రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం కావాలని కోరుకొంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి నా తరపున, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు. సిఎం కేసీఆర్‌ ప్రసంగించేందుకు మైకు వద్దకు వచ్చినప్పుడు సభకు వచ్చిన లక్షలాదిమంది ప్రజలు ఈలలు, కరతాళధ్వనులతో ఆయనకు స్వాగతం పలికారు.