భర్త వేధింపుల్ని భరించలేక....... పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన మహిళ

SMTV Desk 2019-05-30 19:39:16  woman

భర్త వేధింపుల్ని భరించలేని ఓ మహిళ సహనం కోల్పోయి భర్త తల నరికి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు భర్త తలతో వెళ్లి లొంగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అసోంలోని లఖీంపూర్ జిల్లాకు చెందిన గుణేశ్వరి(48) అనే మహిళ, తన భర్త మధురిం(55) వేధింపులను కొన్నేళ్లుగా భరిస్తోంది. అనేక సార్లు గొడ్డలి, కత్తులతో భర్త గాయపరిచినా, పిల్లల కోసం సహిస్తూ వచ్చింది. కానీ రోజురోజుకూ భర్త వేధింపులు శ్రుతి మించుతుండటంతో ఇక అతన్ని చంపడమే తన సమస్యకు పరిష్కారమని భావించింది.

ఈ క్రమంలోనే తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్న గుణేశ్వరి పెద్ద కత్తితో అతడి తలను నరికేసింది. దాన్ని తీసుకుని ఆమె దాదాపు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయింది. మధురిం తలను చేతిలో పట్టుకుని గుణేశ్వరి ఠాణాకు వచ్చిందని, కేసు నమోదు చేసి విచారించగా, అతను పెడుతున్న చిత్రహింసలను వెల్లడించిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది.