మోదీ నివాసంలో అందరికీ టీ-పార్టీ

SMTV Desk 2019-05-30 19:37:58  modi

దేశ రాజధాని ఢిల్లీలో నేతల సందడి క్రమంగా పెరుగుతోంది. ఈ సాయంత్రం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆహ్వానితులతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎంపీలు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రమాణస్వీకారోత్సవం జరగనుండగా, అంతకుముందు మోదీ తన నివాసంలో అందరికీ టీ పార్టీ ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రులుగా తనతో పాటు ప్రమాణం చేయబోతున్న నేతలను మోదీ తన నివాసానికి ఆహ్వానించారు.

అక్కడ వారిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం రాష్ట్రపతిభవన్ కు తరలివెళ్లనున్నారు. ఈ క్రమంలో, ఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం నం.7 లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద సందడి పెరుగుతోంది. నేతలు ఒక్కొక్కరే మోదీ ఇంటికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డి కూడా వెళ్లారు. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి భాగ్యం వరించినట్టు మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.