రెండున్నర నెలలు ఆగండి.. 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా!

SMTV Desk 2019-05-30 18:52:25  jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే విప్లవాత్మక మార్పులు తీసుకునివస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అందుకోసం ఆగస్టు 15 నాటికి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే రాబోయే రెండున్నర నెలల్లో ఊర్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతను గ్రామ వాలంటీర్లను నియమిస్తామని చెప్పారు.

ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామనీ, ఇందుకోసం ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమిస్తామన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్ మాట్లాడారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, ప్రజాసేవ చేయాలనుకునే పిల్లలను ఇందుకు ఎంపిక చేస్తామని జగన్ తెలిపారు. వీరికి గౌరవవేతనంగా రూ.5,000 చెల్లిస్తామని వెల్లడించారు.

ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లకు ఈ మొత్తం చెల్లిస్తామని చెప్పారు. మెరుగైన ఉద్యోగాలు వచ్చేవరకూ ఈ పిల్లలకు గ్రామ వాలంటీర్లుగా అవకాశాలు కల్పిస్తామన్నారు. తమకు సంక్షేమ పథకాల ఫలాలు అందకుంటే, లంచాలు, వేధింపులు జరిగితే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ను కూడా ఆగస్టు 15న ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కాల్ సెంటర్ తన కార్యాలయంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పుడైనా ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చని అన్నారు.