ఆర్మీ పాలన పట్ల సుడాన్‌లో తీవ్ర వ్యతిరేఖత

SMTV Desk 2019-05-30 18:50:43  sudan, army ruling in sudan

ఖర్తూమ్‌: సుడాన్‌లో సైనిక పాలనకు వద్దంటూ ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. ఆర్మీపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో మంగళవారం ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మార్కెట్లు, దుకాణాలు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. నిరసనల నేపథ్యంలో విమాన సర్వీసులను రద్దు చేసుకున్నట్టు సుడాన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. నిరసనల కారణంగా ఖార్‌తౌమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులు ఇబ్బందిపడ్డారు. కాగా, సుడాన్‌లో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతున్నది. అధ్యక్షుడు ఒమర్‌ అల్‌ బషీర్‌ను సుడాన్‌ సైన్యం గతనెలలో బలవంతంగా గద్దె దించింది. అంబ్రెల్లా ఉద్యమ గ్రూపునకు చెందిన నేతలు, ఆర్మీ జనరల్స్‌ పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ పాలన పట్ల సుడాన్‌ పౌరులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సుడాన్‌లో మంగళ, బుధవారం కొనసాగిన నిరసన కార్యక్రమాలకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతిచ్చారు.