వామ్మో......4 వేల మందికి అబార్షన్‌

SMTV Desk 2019-05-30 18:36:23  tamilnadu

తమిళనాడులో ప్రముఖ ఆధ్యాత్మిక శైవక్షేత్రం తిరువణ్ణామలైలో పదేళ్లుగా చట్ట విరుద్ధంగా సుమారు 4 వేల మందికి అబార్షన్‌ చేసిన నకిలీ వైద్య దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువణ్ణామలైలో ఎంబీబీఎస్‌ చేయకుండా వైద్య దంపతులు అబార్షన్‌ చేస్తున్నారని ఎస్పీ శిబిచక్రవర్తికి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తిరువణ్ణామలై ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు.

తిరువణ్ణామలై ఈశాన్యలింగం సమీపంలో ఉన్న ఓ ఫ్యాన్సీ స్టోర్‌లో ఉన్న మహిళను విచారించగా అబార్షన్‌ ఉదంతం వెలుగుచూసింది. 10వ తరగతి వరకు చదువుకున్న కవిత తన భర్త ప్రభుతో కలిసి పదేళ్లుగా అబార్షన్లు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫాన్సీ స్టోర్‌ పేరుతో దొంగచాటుగా అబార్షన్‌ చేస్తున్న ఆ దంపతులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

దీనిపై తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్‌ కందస్వామి మీడియాతో మాట్లా డుతూ, తిరువణ్ణామలైలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, పేద కుటుంబాలకు చెందిన ప్రజలు ఈ కేంద్రాల ద్వారా లబ్ది పొందుతున్నారని తెలిపారు.

తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో ఫ్యాన్సీ స్టోర్‌ నడుపుతూ పదేళ్లలో సుమారు 4 వేల మంది మహిళలకు అబార్షన్‌ చేసిన నకిలీ వైద్యులు కవిత, ప్రభు దంపతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక అబార్షన్‌కు రూ.12 వేలు ఫీజు వసూలుచేస్తున్నట్లు తెలిసిందని, ఈ చర్యలతో ఎవరెవరకి సంబంధాలు న్నాయి అన్న దానిపై దర్యాప్తు జరపాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.