కాబోయే భార్యను చూసేందుకు వెళ్లిన యువకుడు... ప్రియుడితో కలిసి యువతి మర్డర్ ప్లాన్!

SMTV Desk 2019-05-30 18:05:51  crime

తనకు వివాహం నిశ్చయమైన బంధువుల అమ్మాయిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడిని తన ప్రియుడితో కలిసి మట్టుబెట్టేందుకు ప్రయత్నించి, కటకటాలపాలైందా యువతి. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఊత్తంగేరి సమీపంలోని గొల్లనూరు గ్రామానికి చెందిన చిన్నకణ్ణన్‌ కొడుకు శరవణన్‌ (27) తీవ్ర గాయాలతో స్థానికుల కంటబడగా, పోలీసులు రంగంలోకి దిగి అతన్ని ఆసుపత్రికి తరలించి, విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో పోలీసులే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

శరవణన్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఇంజనీర్‌ గా విధుల్లో ఉండగా, అతనికి చెన్నప్పనాయకనూరు గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయి జాన్సీరాణితో పెద్దలు వివాహాన్ని నిశ్చయించారు. అయితే, ఆమెకు అప్పటికే కార్తీక్ (32) అనే మరో యువకుడితో ప్రేమాయణం నడుస్తోంది. శరవణన్ తో వివాహం ఇష్టం లేని ఆమె, అతని అడ్డు తొలగించుకోవాలని భావించి, ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. గత ఆదివారం నాడు కాబోయే భార్యను చూసేందుకు శరవణన్ వెళ్లగా, ప్రేమగా మాట్లాడుతూ, జూస్‌ లో మత్తుమందిచ్చింది. ఏకాంతంగా మాట్లాడుతుందామంటూ బయటకు తీసుకెళ్లింది.

ఆపై ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన కార్తీక్, అతని అనుచరులు శరవణన్ పై దాడి చేసి దారుణంగా కొట్టారు. అతను స్పృహతప్పి పోవడంతో చనిపోయాడనుకుని వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే జాన్సీరాణిని అరెస్ట్ చేశామని, ఆమె ప్రియుడు కార్తీక్, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.