బ్రెగ్జిట్‌ ఒప్పందంపై పునః సంప్రదింపులు లేవు!

SMTV Desk 2019-05-30 15:42:34  Jean-Claude Juncker

బ్రెస్సిల్స్‌: మంగళవారం యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ జీన్‌ క్లాడే జంకర్‌ బ్రెగ్జిట్‌ ఒప్పందంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒప్పందంపై పునః సంప్రదింపులకు ఎలాంటి అవకాశమూ లేదని తేల్చి చెప్పారు. బ్రిటన్‌ ప్రధాని ధెరిస్సా మే వారసుడుగా ఎంపికయ్యే నేత దీనిపై యూరోపియన్‌ యూనియన్‌తో ఘర్షణకు సన్నద్ధమౌతారన్న వార్తల నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ధెరిస్సా మే పదవి నుండి వైదొలుతామని ప్రకటించిన తరువాత బ్రెగ్జిట్‌ పరిస్థితి డోలాయమానంలో పడింది. మరోవైపు అధికార కన్సర్వేటివ్‌ పార్టీలో ప్రధాని పదవికి పోటీ ఏర్పడింది. కొత్త ప్రధాని యూరోపియన్‌ యూనియన్‌తో విడిపోయే విషయమై మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించగలవారై ఉంటారని భావిస్తున్నారు. ఒప్పందం చేసుకున్నా, చేసుకోక పోయినా అక్టోబరులో యూరోపియన్‌ యూనియన్‌ నుండి బ్రిటన్‌ విడిపోతుందని గత వారంలో చెప్పిన బోరిస్‌ జాన్సన్‌ను చివాట్లు పెడుతూ ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్‌ను కొనసాగించడం రాజకీయ ఆత్మహత్యేనని ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే అభ్యర్ధులో ఒకరైన విదేశాంగ కార్యదర్శి జెర్మి హంట్‌ అన్నారు. బ్రెగ్జిట్‌పై 2016లో జరిగిన రిఫరెండంలో యూరోపియన్‌ యూనియన్‌లో కొనసాగేందుకు ఓటేసిన వారిలో హంట్‌ ఒకరు. ఆయన ఇప్పుడు బ్రెగ్జిట్‌ను అంగీకరిస్తున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుండి బ్రిటన్‌ను బయటకు తెచ్చేందుకు కొత్త ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.