మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయీలకు మోడీ నివాళులు

SMTV Desk 2019-05-30 15:26:25  Modi, Mahatma gandhi, vajpai

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో నరేంద్రమోదీ గురువారం ఉదయం మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయీలకు నివాళులు అర్పించారు. తొలుత ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సదైవ్‌ అటల్‌ వద్దకు వెళ్లి వాజ్‌పేయీకి నివాళులర్పించారు. అనంతరం జాతీయ యుద్ధ స్మారక స్తూపం వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు. మోడీ వెంట బిజెపి చీఫ్ అమిత్‌ షా, పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారు.

గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు రానున్నారు. మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌, కిర్గిజ్‌ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌, బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి, మయన్మార్‌ అధ్యక్షుడు యు విన్‌ మైంట్‌, భూటాన్‌ ప్రధాని లోటయ్‌ సెరింగ్‌, థాయ్‌లాండ్‌ ప్రత్యేక దూత గ్రిసాద బూన్‌రాచ్‌లు హాజరుకానున్నారు. కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.