డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు అప్పగింత... సాధారణ పాస్‌పోర్టు తీసుకున్న చంద్రబాబు

SMTV Desk 2019-05-30 14:07:28  chandrababu

ముఖ్యమంత్రి హోదాలో తనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా జారీ చేసిన డిప్లొమాటిక్‌ (డీ టైప్‌) పాస్‌ పోర్టును సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిన్న సరెండర్‌ చేశారు. ముఖ్యమంత్రులు, ప్రత్యేక అధికారులు విదేశీ ప్రయాణాల కోసం ఈ పాస్‌పోర్టును జారీ చేస్తారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడ ఎంజీ రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయానికి స్వయంగా వెళ్లిన ఆయన పాస్‌పోర్టును అప్పగించి సాధారణ పాస్‌ పోర్టును తీసుకున్నారు. వ్యక్తిగత సహాయకులు, భద్రతా సిబ్బందితో కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పది నిమిషాల్లో పని పూర్తి చేసుకున్నారు. అయితే కార్యాలయానికి పాస్‌పోర్టుకు వచ్చినవారు, కొందరు సిబ్బంది చంద్రబాబుతో ఫొటోలు దిగడంతో మరో పది నిమిషాలు ఆయన అక్కడ గడపాల్సి వచ్చింది.