యూట్యూబ్‌లో చూసి దొంగనోట్ల ముద్రణ...డీసీపీ మోనికా భరద్వాజ్ వెల్లడి

SMTV Desk 2019-05-30 13:24:03  youtube

ఓ కంప్యూటర్, ప్రింటర్ ఇంట్లో పెట్టుకుని దర్జాగా ఓ యువకుడు లక్షలాది రూపాయల మేర దొంగనోట్లు ముద్రించిన వైనమిది.. రెండేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడికి ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల రవి సంధు అనే కుర్రాడు రెండేళ్ల క్రితం యూట్యూబ్‌లో "నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించడం ఎలా?" అన్న ఓ వీడియో చూశాడు.

అనుకున్నదే తడవు ఓ కంప్యూటర్ ప్రింటర్ కొనేశాడు. అంతే..! అది మొదలు రూ.200, రూ.500, రూ.2,000 డినామినేషన్లలో దొంగనోట్లు ముద్రించాడు. వాటిని తీసుకెళ్లి పంజాబ్‌లోని మారుమూల ప్రాంతాల్లో మార్చడం మొదలుపెట్టాడు. ఇతగాడి వ్యవహారాన్ని పోలీసులు పసిగట్టడంతో మళ్లీ తిరిగి ఢిల్లీ వచ్చేశాడు.

ఢిల్లీలోని వారాంతపు సంతలు, మద్యం దుఖాణాల వద్ద నకిలీ నోట్లు మార్చేవాడు. అది కూడా బాగా రాత్రివేళ జనసందోహం ఎక్కువగా ఉన్న చోట గుట్టుచప్పుడు కాకుండా పని ముగించుకుని వెళ్లేవాడు. ఢిల్లీ వెళ్లిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉన్న అతడు.. పోలీసుల కంట పడకుండా రెండు, మూడు నెలలకోసారి తన అడ్డా మార్చుతూ వచ్చాడు.

ఒక్కసారి ఓ షాప్‌ దగ్గర నకిలీ నోటు మార్చిన తర్వాత మళ్లీ ఆ షాప్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. వారాంతపు సంతలో అతగాడి కదలికలపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందడంతో ఎట్టకేలకు వలపన్ని రవి సంథును పట్టుకున్నారు. సరిగ్గా నకిలీ నోట్లు పట్టుకుని ఓ షాప్ దగ్గరికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 1.38 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు రూ.10 లక్షల మేర దొంగనోట్లు మార్చినట్టు రవి విచారణలో ఒప్పుకున్నాడని డీసీపీ మోనికా భరద్వాజ్ పేర్కొన్నారు.