ఉగ్రవాదుల వేషాల్లో జూనియర్ ఆర్టిస్టులు....ఆగిపోయిన హృతిక్ రోషన్ సినిమా!

SMTV Desk 2019-05-30 12:50:38  junior artists

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం మరో నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి ఓ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగును ముంబైలో నిర్వహిస్తున్నారు. అయితే సినిమాలో ఉగ్రవాదులుగా నటిస్తున్న ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులకు షూటింగ్ సందర్భంగా ఈరోజు బ్రేక్ లభించింది. దీంతో వేసుకున్న డ్రస్సులు తీయకుండానే వీరు ఓ షాపుకు వెళ్లారు.

దీంతో అటుగా వెళుతున్న ప్రజలు బెంబేలెత్తి పోయారు. వీరిని గమనించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు వీరిద్దరికీ బేడీలు వేసి స్టేషన్ కు తరలించారు. "మేము జూనియర్ ఆర్టిస్టులం మొర్రో" అని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న సినిమా నిర్మాతలు సాక్ష్యాలను తీసుకుని వెళ్లడంతో ఇద్దరు ఆర్టిస్టులను పోలీసులు విడిచిపెట్టారు. ఈ వ్యవహారంతో సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారు. కాగా, ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు.