లాఠీని ఫ్లూట్‌గా మార్చిన పోలీస్... వీడియో వైరల్ !!

SMTV Desk 2019-05-30 12:43:07  police lati

ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపే ఉండదు అన్నాడో సినీరచయిత. చేస్తున్న పనిలోనే సంతోషం వెతుక్కుంటే అందులో ఉండే కిక్కే వేరు. ఇది నిజమని నిరూపించారు కర్నాటక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చంద్రకాంత్ హుత్గి. ఫైబర్‌తో తయారైన తన లాఠీని ఫ్లూట్‌గా మలచి జానపద గీతాలు వాయించడం హాబీగా చేసుకున్నారు.

హుబ్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 52 ఏళ్ల ఆయన... తన ప్రత్యేక కళతో ఉన్నతాధికారుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల కర్నాటక అదనపు డీజీపీ భాస్కర్ రావు చంద్రకాంత్‌ను బెంగళూరు పిలిపించుకుని కొన్ని పాటలు విన్నారు. ప్రత్యేక నగదు బహుమతితో ఆయనను గౌరవించారు.

ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. ‘‘సంగీత వాయిద్యాలు తయారు చేసి వాటిని వాయించడం నాకు ఎప్పటినుంచో ఉన్న హాబీ. పని ముగించుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో జానపద గీతాలు వాయించేందుకు వీలుగా ఫైబర్ లాఠీని ఫ్లూట్‌గా మలిచాను..’’ అని వెల్లడించారు. తన సహచరుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అదనపు డీజీపీ తనను పిలిపించి సత్కరించినట్టు తెలిపారు. కాగా చంద్రకాంత్ లాఠీతో ఫ్లూట్ వాయిస్తున్న వీడియో అదనపు డీజీపీ భాస్కర్ రావు ట్విటర్‌లో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.