మోదీజీ... ఐయామ్ సో సారీ... : మమతా బెనర్జీ

SMTV Desk 2019-05-29 15:33:32  modi

అందరు ముఖ్యమంత్రులతో సంప్రదించిన తర్వాతే మోదీ ప్రమాణస్వీకారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు మంగళవారంనాడు ప్రకటించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 24 గంటలు కూడా తిరక్కుండానే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మోదీ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు మమత ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్ హింసాకాండలో మృతిచెందిన 54 మంది వ్యక్తుల కుటుంబాలను ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ ఆహ్వానించడమే మమత తాజా నిర్ణయానికి కారణమైంది. ప్రమాణస్వీకారం అనేది ప్రజాస్వామ్య పండుగలాంటిదని, ఆలాంటి కార్యక్రమం ఏ పార్టీని కించపరచేలా ఉండకూడదని మమత తాజా ట్వీట్‌లో నిప్పులు చెరిగారు.

"కొత్త ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. రాజ్యాంగపరమైన ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని అనుకున్నాను. అయితే, చివరి నిమిషంలో... బెంగాల్‌లో జరిగిన హింసాకాండలో 54 మంది ప్రాణాలు కోల్పోయారంటూ బీజేపీ చెప్పినట్టు మీడియాలో వచ్చిన వార్తలు చూశాను. ఇది పూర్తిగా అబద్ధం.

బెంగాల్‌లో రాజకీయ హత్యలు జరగలేదు. వ్యక్తిగత శత్రుత్వం, కుటుంబ కలహాలు, ఇతర వివాదాలు ఈ మరణాలకు కారణం కావచ్చు. వీటితో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి రికార్డు కూడా మా దగ్గర లేదు. బీజేపీ చేసిన క్లెయిమ్‌ వల్లే ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురైందని చెప్పడానికి చింతిస్తున్నాను. మోదీజీ... ఐయామ్ సో సారీ..." అని ఆ ట్వీట్‌లో మమత స్పష్టత ఇచ్చారు.