కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం....

SMTV Desk 2019-05-29 15:32:14  modi

ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న నరేంద్రమోదీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంతనాలు జరిపారు. గురువారం మోదీతోపాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేయాలనే అంశంపై నేతలిద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ కొత్త మంత్రి మండలి కూర్పు ఎలా ఉండాలి? కొత్తగా ఎవరెవరికి అవకాశం కల్పించాలి? రద్దు కానున్న ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎవరెవరిని కొనసాగించాలన్న విషయాలపై ఇరువురూ చర్చలు జరిపారు.

పార్టీ తిరిగి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా కొత్త ప్రభుత్వంలో భాగస్వామి అవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై షా ఇంతవరకు స్పందించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. అనూహ్యంగా బలం పుంజుకున్న పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. రద్దుకానున్న ప్రభుత్వంలో కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించినవారికి కొత్త ప్రభుత్వంలోనూ స్థానం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.