మళ్లీ సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదు: పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-05-29 15:30:48  pawan kalyan

ప్రజాసేవకే తన జీవితం అంకితమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాను సినిమాలో నటించబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఆయన ఖండించారు. తాను మళ్లీ సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఓ టీవీ ఛానల్ ప్రతినిధితో జనసేన అధినేత ఈరోజు మాట్లాడారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పవన్ హీరోగా బండ్లగణేశ్ నిర్మాతగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. దీన్ని ఖండించిన పవన్.. రాబోయే 25 ఏళ్లు ప్రజల కోసమే పనిచేస్తామని స్సష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో ఘనవిజయం సాధించగా, టీడీపీ 23, జనసేన ఓ స్థానంలో విజయం సాధించాయి.