కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టలేను... ప్రధానికి అరుణ్ జైట్లీ లేఖ

SMTV Desk 2019-05-29 15:27:03  arun jaitley

గత ఐదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా విశిష్ట సేవలు అందించిన అరుణ్ జైట్లీ మరోసారి తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేనని స్పష్టం చేశారు. ఆరోగ్యపరంగా సమస్యలు చుట్టుముట్టాయని, చికిత్స కోసం సమయం కేటాయించాల్సి ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బీజేపీ పార్లమెంటరీ నేత నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

"గత ఐదేళ్లుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఎంతో నేర్చుకున్నాను. అంతకుముందు కూడా తొలిసారి ఎన్డీయే ఏర్పడినప్పుడు సైతం సముచిత స్థానం కల్పించారు. ఎన్డీయే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎంతో గౌరవించారు. అయితే గత 18 నెలలుగా తీవ్ర అనారోగ్యం నాకు సవాలుగా మారింది. డాక్టర్లు చాలా సమస్యల నుంచి నాకు ఉపశమనం కలిగించారు. భవిష్యత్తు దృష్ట్యా కొన్నాళ్ల పాటు ఎలాంటి బాధ్యతలు చేపట్టరాదని నిర్ణయించుకున్నాను.

మీరు కేదార్ నాథ్ వెళ్లేముందు ఇదే విషయాన్ని నోటిమాటగా చెప్పాను. మంత్రిత్వ బాధ్యతలు లేకపోతే నా ఆరోగ్యంపై దృష్టి సారించడానికి తగిన సమయం దొరుకుతుందని భావిస్తున్నాను. నాకోసం నేను కొంత సమయం కేటాయించడానికి దయచేసి అనుమతి ఇవ్వండి. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. ప్రస్తుతం కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్ధంగా లేను. అయితే పార్టీకి, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగానే నిలుస్తాను" అంటూ తన లేఖను ముగించారు.