రెండోసారి దేశాధ్యక్ష పదవి ఎన్నికైన ముథారికా

SMTV Desk 2019-05-29 15:02:30  Malawi President Peter Mutharika

లిలాంగ్వే: మాలవి అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మాలవి కాంగ్రెస్‌ పార్టీ (ఎంసీపీ) నేత ముథారికా రెండో సారి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మాలవి ఎలక్టోరల్‌ కమిషన్‌ (ఎంఈసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.... అధ్యక్ష ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ముథారికా గెలుపొందారు. ఆయనకు 38.57శాతం ఓట్లు వచ్చాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత లజారస్‌ చాక్‌వెరాకు 35.41శాతం ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుత మాలవి ఉపాధ్యక్షుడు సౌలస్‌ చిలీమాకు 20.24శాతం ఓట్లు వచ్చాయి. కాగా, 2014లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ముథారికాకు 36.4శాతం ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికతో పోల్చినట్టయితే ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు నమోదైన ఓట్ల శాతం స్వల్పంగా పెరిగిందని ఎంఈసీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, అధ్యక్ష ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని, ఎన్నికల ఫలితాలను వాయిదా వేయాలని మాలవి విపక్షనేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈకేసుపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్నికల ఫలితాలను వాయిదా వేయొద్దని ఆదేశించింది. దీంతో, తాజాగా ఎంఈసీ అధ్యక్ష ఫలితాలను విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రీకౌంటింగ్‌ నిర్వహించే ప్రసక్తి లేదని ఎంఈసీ మరోసారి స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినట్టు మాలవి ఐజీ రోడ్నీ జోస్‌ తెలిపారు.