సృజన్ రెడ్డిగారు.. మిమ్మల్ని చూసి మొత్తం తెలంగాణ గర్విస్తోంది.. మీకు నా సెల్యూట్!: హరీశ్ రావు

SMTV Desk 2019-05-29 14:16:33  harish rao

కరీంనగర్ జిల్లా మడిపల్లి గ్రామంలో బావిలో పూడిక తీసేందుకు దిగిన ఇద్దరు వ్యక్తులు స్పృహ కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు అక్కడే ఉన్నప్పటికీ ఎవ్వరూ బావిలోకి దిగినా, లోపలకు వెళ్లలేకపోయారు. అయితే జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి వెంటనే రంగంలోకి దూకేశారు.

బావిలోకి తాడుతో దిగి ఇద్దరిని పైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తాడు తెగిపోవడంతో ఆయనకు గాయాలు అయ్యాయి. చివరికి సృజన్ రెడ్డి సురక్షితంగా పైకి వచ్చారు. తాజాగా ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలపై టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

‘ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్ముల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్’ అని ట్వీట్ చేశారు.