ఆకాశంలో రాకెట్ల ట్రైన్...వైరల్ వీడియో

SMTV Desk 2019-05-29 12:24:03  SpaceX Starlink Satellites Spotted Over Netherlands

అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే ప్రముఖ ‘స్పేస్‌ ఎక్స్‌’ ప్రైవేట్‌ సంస్థ తాజాగా 60 ఉపగ్రహాలు ఆకాశంలో పంపించడంతో అవి అందరిని అబ్బురపరిచాయి. ఒకదాని వెనుక ఒకటి వెళ్లడంతో అవన్నీ రైలు బోగీలను తలపించాయి. ఆకాశంలో రైలు కూత వేస్తూ వెళ్తుందా అన్నంత పనిచేశాయి. ఈ వీడియో చూసిన చాలామంది ఆకాశంలో రైలు ఎగురుతోందా.. ఎక్కడా? అని ప్రశ్నల వర్షం గుప్పించారు. గత గురువారం 60 స్టార్‌లింక్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ విస్తృతి కోసం దాదాపుగా 12 వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలో తొలిదశలో 60 ఉపగ్రహాలను తక్కువ ఎత్తు కక్ష్యలో ప్రవేశపెట్టింది. అయితే ఇవి ఓ రైలు మాదిరిగా అంతరిక్షంలోకి చేరాయి. నెదర్లాండ్‌కు చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మాక్రోలాంగ్‌బ్రోక్‌ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి అంతరిక్ష అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ ప్రయోగం చేపట్టిన కొన్ని గంటల అనంతరం ఆయన‌.. యూరప్‌పై ఆకాశంలో దూసుకెళ్తున్న ఉపగ్రహాల వరుస క్రమాన్ని క్లిక్‌మనిపించారు. ఈ వీడియో చాలామందిని విశేషంగా అలరిస్తోంది. ఆకాశంలో వింత అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఉపగ్రహాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయని ఈ ప్రయోగం అనంతరం స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో తెలిపారు.