శతకాలతో దంచిన రాహుల్, ధోని ..భారత్ చేతిలో బంగ్లా చిత్తు

SMTV Desk 2019-05-29 12:04:11  kl rahul, Ma dhoni,

కార్డిఫ్: ప్రపంచకప్‌కు ముందు జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరును సాధించింది. లోకేశ్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోనిలు శతకాలతో కదంతొక్కారు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ 99 బంతుల్లో 12 ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో 108 పరుగులు చేశాడు.

మరోవైపు ధోని విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన ధోని 78 బంతుల్లోనే 8 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. ఇటు ధోని, అటు రాహుల్‌లు చెలరేగి ఆడడంతో పరుగుల వరద పారింది. వీరిని ఔట్ చేసేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి 47 పరుగులు చేశాడు. కాగా, ఓపెనర్లు రోహిత్ శర్మ (19), శిఖర్ ధావన్ (1) మరోసారి నిరాశ పరిచారు. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 264 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ దాస్ 73 ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్, చాహల్ మూడేసి వికెట్లు తీశారు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.