జూనియర్ ఎన్టీఆర్ అసహనం ?

SMTV Desk 2019-05-29 11:44:21  Junior Ntr,

ఈరోజు ఎన్టీఆర్ జయంతి అనే విషయం తెలిసిందే. అయితే ప్రతి ఏటా ఈ వేడుక నాడు మహానాడు నిర్వహించి ఆయన జయంతిని గ్రాండ్ గా నిర్వహించేవారు తెలుగుదేశం శ్రేణులు. అయితే ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా ఓడిపోవడంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కనీస అలంకరణలేక బోసిపోయింది. ప్రతి సంవత్సరమూ ఎన్టీఆర్ జయంతి నాటికి ఘాట్ ను ఎంతో అందంగా అలంకరిస్తారు. రక రకాల పూలు తెచ్చి, ఎన్టీఆర్ స్మారకాన్ని తీర్చిదిద్దుతారు. ఈ సంవత్సరం మాత్రం ఘాట్ ను అలాగే వదిలేశారు. కనీసం పెచ్చులూడిన భాగాలకు మరమ్మతులు కూడా చేయలేదు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, తన తాతయ్య సమాధిని అలా చూసి, ఒకింత అసహనానికి గురయ్యారు.

ఘాట్ పై పుష్పాలంకరణను వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్, తన సోదరుడితో కలిసి అక్కడే కూర్చున్నారు. సమాధి అలంకరణ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. ఆపై తాతయ్యను అందరూ వదిలేశారని, ఇకపై తాతయ్య జయంతి, వర్థంతి వేడుకలను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించిన జూనియర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. అలాగే ఆయానకి నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, ఘాట్ వద్ద ఏర్పాట్లపై మండిపడ్డారు. ఎంతో పవిత్రంగా చూడాల్సిన ప్రదేశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా గాలికి వదిలేశారని, కనీస అలంకరణ కూడా లేకపోయిందని కంటతడి పెట్టారు.