దక్షిణ ఆఫ్రికాలో తొలిసారి పైలట్‌ అయిన నల్లజాతీయురాలు

SMTV Desk 2019-05-29 11:26:16  africa, cyril ramaphosa

ప్రిటోరియా: శనివారం దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్‌ రమాఫోసా ప్రమాణం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. అయితే, అదే రోజున సోషల్‌మీడియాలో ఓ యువ పైలట్‌ పెట్టిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. మండీసా నోమ్‌సెబో ఎమ్‌ఫెకా (32) ఓ నల్లజాతీయురాలు. దక్షిణ ఆఫ్రికా తీర ప్రాంతంలోని డర్లన్‌కు సమీపంలోని తుసూమా ప్రాంతంలో ఆమె జన్మించింది. ఐదేండ్ల వయసులో ఉన్నప్పటి నుంచే మండీసాలో పైలట్‌ కావాలనే కోరిక మదిలో బలంగా నాటుకుంది. 2008లో పైలట్‌ శిక్షణలో చేరింది. 2013లో ఆమె దక్షిణ ఆఫ్రికా వాయుసేనలో చేరింది. దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వైమానిక విన్యాసాలు ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, దక్షిణ ఆఫ్రికాను చూసి తాను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటానంటూ మండీసా పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆమె పోస్ట్‌ను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. మండీసా ఓ నల్లజాతీయురాలైనప్పటికీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ధీరవనిత అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మహిళా సాధికారతకు ఆమె ఓ నిలువెత్తు నిదర్శనమంటూ మరికొందరు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.