'నోటా' గెలిచింది వీరు ఓడిపోయారు!!

SMTV Desk 2019-05-28 16:50:00  nota

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు వివిధ పార్టీల నేతలను కంగుతినిపించాయి. యూపీలోని గోరఖ్‌పూర్, బస్తీ లోక్‌సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలోకి1 దిగిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, కార్యదర్శి ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోవడమే కాకుండా, చివరికి నోటా ముందు కూడా చతికిలబడిపోయారు. దీనిని జీర్ణించుకునేందుకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ వాస్తవమిదే!

గోరఖ్ పూర్ లోక్‌సభ సీటు నుంచి షాన్-ఏ-హింద్ పార్టీ అభ్యర్థి అవధేష్ కుమార్ సింగ్ అతి కష్టం మీద 1305 ఓట్లను దక్కించుకున్నారు. అయితే ఈ స్థానంలో ‘నోటా’కు 7647 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బస్తీ లోక్‌సభ సీటు నుంచి జనహిత కిసాన్ పార్టీ కార్యదర్శి రామ్ ప్రసాద్ చౌదరి కూడా నోటా ముందు ఓటమి చవిచూశారు. ఇక్కడ రామ్ ప్రసాద్ చౌదరి 3734 ఓట్లు సంపాదించగా, నోటా కు 10298 ఓట్లు వచ్చాయి.

గోరఖ్‌పూర్, బస్తీలలోని మొత్తం 9 లోక్‌సభ సీట్లలో 48 పార్టీలకు చెందిన అభ్యర్థులు ‘నోటా’ ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వీరిలో గోరఖ్‌పూర్ నుంచి నలుగురు, దేవరియా నుంచి ఏడుగురు, సలేమ్‌పూర్ నుంచి 9మంది, కుషీనగర్ నుంచి 8 మంది, మహరాజ్‌గంజ్ నుంచి ఐదుగురు, సంత్‌కబీర్‌నగర్ నుంచి ఇద్దరు, బస్తీ నుంచి ఐదుగురు, బాంస్‌గావ్ నుంచి ఒకరు, డుమరియాగంజ్ నుంచి ఏడుగురు... వీరంతా కనీసం తమ డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయారు.