40 సంవత్సరాల తరువాత మళ్ళీ!

SMTV Desk 2019-05-28 16:44:53  america, taiwan, Taiwan and US officials hold rare meeting

తైపీ: దాదాపు 40 సంవత్సరాల తరువాత అమెరికా, తైవాన్‌ దేశాల జాతీయ భద్రతా అధికారులు భేటీ అయ్యారు. 1979 తర్వాత ఇరుదేశాల అధికారులు తాజాగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, భద్రతా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై అమెరికా జాతీయ భద్రతా అధికారులతో చర్చించినట్టు తైవాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ చీఫ్‌ డేవిడ్‌ లీ తెలిపారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ఈనెల13 నుంచి 21 వరకు తైవాన్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అంశాలపై చర్చించినట్టు తైవాన్‌ పేర్కొంది. కాగా, తైవాన్‌ తమ భూభాగంలో అంతర్భాగమేనని చైనా స్పష్టం చేసింది. చైనాపై తైవాన్‌ను ఉసిగొల్పేందుకు పలు దశాబ్దాల నుంచి అమెరికా విఫలయత్నాలు చేస్తోంది. 2010లో 15బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా తైవాన్‌కు విక్రయించింది. కొంతకాలంగా అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనా ఆర్థికవ్యవస్థను దెబ్బతీయాలనే దురుద్దేశంతో చైనా వస్తువులపై అమెరికా భారీ సుంకాలు పెంచింది.