వేలంలో రూ.8 కోట్లు పలికిన మోస్ట్ డేంజరస్ ల్యాప్‌టాప్‌‌

SMTV Desk 2019-05-28 16:02:40  most dangerous laptap in the world

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌‌కు భారీగా ఆదరణ లభిస్తోంది. ఈ మధ్య ప్రమాదకరమైన వాటిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌‌కు ఆన్‌లైన్‌ వేలంలో భారీ ధర పలుకుతోంది. వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్‌పీస్‌పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు అంటున్నారు నిర్వాహకులు. ‘ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్’ అనే శీర్షికతో, గ్వో ఓ డోంగ్‌ దీన్ని సృష్టించారు. అరివీర భయంకరమైన ఆరు వైరస్‌లు(ఐ లవ్‌యూ, మైడూమ్‌, సోబిగ్‌, వాన్నా క్రై, డార్క్ టెక్విలా, బ్లాక్ఎనర్జీ) ఈ ల్యాప్‌టాప్‌లో తిష్ట వేశాయట. ఇది ‘వరల్డ్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్‌టాప్‌గా పేరు కూడా తెచ్చుకుంది. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందట. అలాంటి ల్యాప్‌టాప్‌‌ను బుద్ధున్న ఎవరైనా వేలం వేస్తారా? తీసి అవతల పారేస్తారు.. లేదంటే కాల్చి పారేస్తారుగా అని అనుకుంటున్నారు కదూ. అయినా దీన్ని కొనాలని ఎవరికి అనిపిస్తుందనే అనుమానం కూడా కలగక మానదు.సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అతి ప్రమాదకరమైన ఆ ఆరు వైరస్‌లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్‌ను వేలానికి వుంచారు. డిజిటల్‌ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని గ్వో వెల్లడించారు. విండోస్‌ ఎక్స్‌పీ ఆధారిత శాంసంగ్‌ ఎన్‌సీ10 దీని పేరు. 10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్‌ ఇది. వైఫై, ఫ్లాష్‌డ్రైవ్‌కి కనెక్ట్‌ చేయనంత వరకూ దీన్నుంచి మిగతా పీసీలకు ఈ వైరస్‌లకు వ్యాపించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు.