కూతురి పెళ్లిలో పాటలు పాడుతూ కుప్పకూలిన ఎస్సై - వీడియో వైరల్

SMTV Desk 2019-05-28 15:43:35  si

కుమార్తె పెళ్లి జరుగుతుండగా, ఉత్సాహంగా పాటలు పాడుతూ ఉన్న తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటన కేరళలో జరిగింది. కొల్లాం సమీపంలోని కర్మనా పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసే విష్ణుప్రసాద్ తన కుమార్తెకు పెళ్లి నిశ్చయించారు. మంచి సంబంధం, భారీగా తరలివచ్చిన బంధుమిత్రులు, ఇంకేముంది.. పెళ్లివేడుకలో విష్ణుప్రసాద్ లో ఉత్సాహం ఉప్పొంగింది.

లేట్ నైట్ మ్యారేజి కావడంతో అతిథులను ఉల్లాసపర్చడానికి సంగీత విభావరి ఏర్పాటు చేశారు. విష్ణుప్రసాద్ కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. తన గానప్రతిభను ప్రదర్శించడానికి కుమార్తె పెళ్లి వేడుకను మించిన వేదిక ఏముంటుందని భావించారు. మైక్ అందుకుని మమ్ముట్టి పాట పాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

పెళ్లికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా ఆర్కెస్ట్రా ఉన్నవైపుకు పరుగులు తీశారు. అప్పటికే విష్ణుప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న పెళ్లిమంటపం కాస్తా విషాదంతో స్తబ్దుగా మారిపోయింది.