రోహిణి కార్తె దెబ్బకు.. ఒక్కరోజే 40 మంది మృతి

SMTV Desk 2019-05-28 15:39:54  Temparature, Telangana, Heat wave,

రోహిణి కార్తె దెబ్బకు తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడు గత రికార్డులను బద్దలుగొడుతూ నిప్పుల వాన కురిపిస్తున్నాడు. నిన్న సూర్యుడి విశ్వరూపానికి 130 ఏళ్ల రికార్డు చెరిగిపోయింది. జగిత్యాల జిల్లా కోల్వాయి, ఎండపల్లి రాజరాంపల్లిలో 47.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 130 ఏళ్లలో తెలంగాణలో ఇది రెండో అత్యధిక ఉష్ణోగ్రత. ఇక, రామగుండంలో 47.2, ఆదిలాబాద్‌లో 45.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే అంతో ఇంతో చల్లగా ఉండే హైదరాబాద్‌ లోనూ భానుడు ప్రకోపం కొనసాగుతోంది. సోమవారం బేగంపేటలో 42.5 ఉష్ణోగ్రత నమోదు కాగా, బహదూర్‌పురలో 44.1, మాదాపూర్‌లో 44 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణలో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎండ వేడిమికి తెలంగాణ ప్రజలు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 మంది, నల్గొండ జిల్లాలో 11 మంది మిగతా చోట్ల కూడా జనం చాలా మంది చనిపోయారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంతో ముఖ్యమైన పనులుంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా మంచినీళ్లు ఎక్కువగా తాగాలని, కొబ్బరినీళ్లు, జ్యూస్‌లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.