కేసీఆర్‌ నియంతృత్వ పోకడలే తెరాస కొంప ముంచాయి

SMTV Desk 2019-05-28 15:35:09  jeevan reddy , kcr,

తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిన తెరాసకు లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫలితాలపై ప్రతిపక్షాలు ఒకే ఒక కారణం ప్రదానంగా చెపుతున్నాయి. కేసీఆర్‌ నియంతృత్వపోకడల కారణంగానే ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని చెపుతున్నాయి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, “నాకంటే గొప్ప నాయకుడు లేదు... నా అంత తెలివితేటలు మరెవరికీ లేవు. నేను చెప్పిందే వేదం... నేను ఏమి చేస్తే అదే కరెక్ట్...ఎవరూ ప్రశ్నించరాదు,” అనుకొనేవారికి ఏదో ఒకరోజు ఇలాగే ఎదురుదెబ్బ తగులుతుంది. సిఎం కేసీఆర్‌ నియంతృత్వ పోకడలే తెరాస కొంప ముంచాయి. నిజామాబాద్‌లో తెరాస అభ్యర్ధి కవితను ఓడించేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు కుమ్మక్కు అయ్యాయనే తెరాస వాదన సరికాదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ ఓట్లు బిజెపికి పడలేదు. తెరాస ఓట్లే బిజెపికి పడ్డాయి. ముఖ్యంగా తెరాస సర్కార్ నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం చెందిన జిల్లా రైతులందరూ కవితకు వ్యతిరేకంగా ఓటేయడంతో ఆమె ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలలో సంక్షేమ పధకాలే తెరాసను గెలిపించాయి. కానీ ఆ తరువాత వెంటనే జరిగిన ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. రైతులు, నిరుద్యోగులు, ఇంకా వివిద వర్గాలకు చెందిన ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న కారణంగానే తెరాసకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఎన్నికలలో గెలుపోటములు సహజమే కనుక ఇప్పటికైనా సిఎం కేసీఆర్‌ తన విధానాలను, వైఖరిని మార్చుకొని ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తే మంచిది,” అని అన్నారు.