తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు..

SMTV Desk 2017-08-27 13:36:17  weather report, two days heavy rains, telangana, andhra pradesh

హైదరాబాద్, ఆగస్ట్ 27 : ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు కోస్తాపై ఆవరించిన ఆవర్తనం కలవడం వల్ల రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖా అధికారులు హెచ్చరించారు. ఈ ఆవర్తనం ప్రస్తుతం ఒడిసా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా ప్రయాణిస్తుందని, దీని వల్ల ఒడిసా, ఉత్తర కోస్తా, ఛత్తీస్ గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ రాష్ట్రాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు బిహార్‌ నుంచి ఉత్తర కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా, ఈ రెండింటి ప్రభావ౦ కారణంగా ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.