బంగ్లాదేశ్‌తో రెండో వార్మప్ మ్యాచ్....టీంఇండియాకు పరీక్షే

SMTV Desk 2019-05-28 15:29:24  icc world cup 2019, team india vs bangladesh warmup match

కార్డిఫ్: వరల్డ్ కప్ టోర్నీ ముందు నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచ్ లో సందర్భంగా నేడు టీమిండియాకు రెండో మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరగనుంది. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో టీంఇండియా పరాజయ పాలైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి సన్నాహక మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తన లోపాలపై భారత్ దృష్టి పెట్టింది.బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో మ్యాచ్ భారత్‌కు పరీక్షగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా రానున్న ప్రపంచకప్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భారత్ భావిస్తోంది. కాగా, బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకుంటే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు కష్టమేమి కాదు. ఓపెనర్లు ధావన్, రోహిత్‌లు శుభారంభం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఓపెనర్లే కీలకంగా మారిన విషయం తెలిసిందే. బౌన్స్‌కు సహకరించే ఇంగ్లండ్ పిచ్‌లపై శుభారంభం లభిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు తమ బ్యాట్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలోనే ధావన్, రోహిత్‌లు అత్యుత్తమ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. పలు మ్యాచుల్లో శుభారంభం అందించిన ఘనత వీరికుంది. అంతేగాక ఇంగ్లండ్ పిచ్‌లపై కూడా రికార్డు మెరుగ్గానే ఉంది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.