త్వరలో పరిషత్ ఫలితాలు

SMTV Desk 2019-05-28 14:54:33  Elections results,

రాష్ట్రంలో మూడు దశలలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 27న జరిపి వెంటనే ఫలితాలు ప్రకటించవలసి ఉంది. కానీ ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వరకు ఉన్నందున ఇప్పుడే ఫలితాలు ప్రకటిస్తే గెలిచిన అభ్యర్దులు ఫిరాయింపులకు పాల్పడవచ్చని, కనుక అప్పటి వరకు ఫలితాలను ప్రకటించవద్దని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరింది. దాని సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలోని 147, 176 సెక్షన్లకు సవరణ చేస్తూ సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.

సవరణ చేయక ముందు ‘గెలిచిన సభ్యులు తొలి సమావేశం నిర్వహించుకొని’ అని ఉండగా దానిని ‘గెలిచిన సభ్యులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని’ గా సవరణ చేసింది. దాంతో గెలిచిన అభ్యర్ధులు తక్షణమే ‘ప్రత్యేకసమావేశాలు’ నిర్వహించుకొని జెడ్పీ, ఎంపీపీ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఎన్నుకొనేందుకు వీలు కలుగుతుంది కనుక వారు తమ పదవీ బాధ్యతలు చేపట్టడానికి ఇంకా 40 రోజులు సమయం ఉన్నప్పటికీ ఫిరాయింపులకు ఆస్కారం ఉండకపోవచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మార్గం సుగమం అయ్యింది కనుక ఎన్నికల సంఘం త్వరలోనే తేదీ ప్రకటించవచ్చు.