వైరల్ వీడియో: మోదీ గెలిచిన ఆనందంలో.......వీధుల్లో నోట్లు విసిరేసిన మిలియనీర్

SMTV Desk 2019-05-27 18:27:09  modi

భారత మిలియనీర్ ఒకరు న్యూయార్క్ వీధుల్లో డాలర్లు విసిరేశాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అద్భుత విజయం సాధించిన ఆనందంలోనే అతడు 100 డాలర్ నోట్లు గాల్లోకి విసిరాడంటూ ఓ నెటిజన్ దీన్ని ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు.

‘‘న్యూయార్క్‌లోని 47 స్ట్రీట్ (డైమండ్ మార్కెట్)లో ఇవాళ 100,000 డాలర్లు పంచిపెట్టేశారు. మోదీ గెలిచిన ఆనందంలో ఓ ఇండియన్ మిలియనీర్ డాలర్లు ఎలా విసిరేస్తున్నాడో చూడండి..’’ అంటూ సదరు నెటిజన్ పేర్కొన్నాడు. అత్యంత రద్దీగా ఉండే మాన్హాటన్‌లో పలువురు గుంపులు గుంపులుగా ఆ నోట్లు ఏరుకుంటున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇది వాస్తవం కాదని తేలింది.



ఈ సంఘటన అమెరికాలో జరిగిన విషయం వాస్తవమే అయినా అసలు నిజం ఏమిటంటే... డాలర్లు విసిరిన ఆ వ్యక్తి భారతీయుడు కాదు. ‘దిగాడ్ జో కుష్’ అనే అమెరికన్ ర్యాపర్. వారం రోజుల క్రితమే.. అంటే భారత్‌లో ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజుల క్రితమే సదరు ర్యాపర్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్టు చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో పేర్కొన్నట్టు అవి 100 డాలర్ నోట్లు కాదు... 5 డాలర్ల నోట్లు! కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని ఓ భారతీయుడు ఇలా చేశాడన్న వాదనలో ఏమాత్రం నిజం లేదని అర్థమవుతోంది.