బుమ్రా నోబాల్ వల్ల నేను ఫేమస్ అయిపోయా: పాక్ క్రికెటర్

SMTV Desk 2019-05-27 18:20:29  jasprit bumrah, fhakar zaman

టీంఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వల్ల క్రికెటర్‌గా తనకు సుస్థిర జీవితానిచ్చిందని పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఫకార్ జమాన్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే బుమ్రా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే.. ఆ బంతి క్రీజు నోబాల్‌గా తేలడంతో ఫకార్ జమాన్‌కి జీవనదానం లభించగా.. అనంతరం చెలరేగిపోయిన అతను కెరీర్‌లో తొలి సెంచరీ మార్క్‌ని అందుకోవడంతో పాటు 114 పరుగులతో పాకిస్థాన్‌కి భారీ స్కోరు అందించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 180 పరుగుల తేడాతో ఓడిపోగా.. పాకిస్థాన్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ వేదికగా మరోసారి భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. మే 30 నుంచి ప్రపంచకప్ మొదలుకానుండగా.. దాయాది దేశాల మధ్య మ్యాచ్ జూన్ 16న జరగనుంది. ఈ నేపథ్యంలో.. మీడియాతో తాజాగా ఫకార్ జమాన్ మాట్లాడాడు. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా పాక్‌ చేతిలో భారత్ ఓడిపోలేదు. మరోవైపు 1992లో పాకిస్థాన్‌ ఏకైక, చివరిసారి ప్రపంచకప్‌ని గెలిచింది. ఈ సందర్భంగా ఫకార్ మాట్లాడుతూ...‘బుమ్రా నోబాల్ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఆ ఫైనల్‌కి ముందు వరకూ నాకు నోబాల్‌‌‌లో ఔటవ్వాలనే డ్రీమ్ ఉండేది. అనూహ్యంగా అది నిజమైంది. భారత్‌పై మ్యాచ్‌లో బాగా ఆడతానని నా తల్లిదండ్రులకి అప్పటికే ప్రామిస్ చేశాను. దాంతో.. ఫైనల్లో తొలుత ఔటవగానే.. చాలా బాధనిపించింది. భారత్‌పై సెంచరీ తర్వాత నేను బాగా ఫేమస్ అయిపోయాను. కానీ.. పేరు ప్రఖ్యాతలతో పాటు బాధ్యత కూడా పెరిగింది. గతంతో పోలిస్తే.. ఇప్పుడు పరిణతితో ఆడుతున్నా. ఇప్పుడు నా లక్ష్యం ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా ఆడటమే’ అని వెల్లడించాడు.