ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస ప్రతివ్యూహాలు

SMTV Desk 2019-05-27 18:04:43  TRS,

లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలినందున, ఈ నెల 31న జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించి మళ్ళీ తన సత్తా చాటుకోవాలని తెరాస చాలా పట్టుదలగా ఉంది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో జరుగబోయే 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకొనే బాధ్యతను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వీకరించి ఎన్నికల యుద్ధానికి సిద్దం అవుతున్నారు.

వరంగల్ జిల్లాలో 905, నల్గొండలో 1084, రంగారెడ్డి జిల్లాలో 812 మంది ఓటర్లున్నారు. వారిలో అత్యధికులు తెరాస మద్దతుదారులే అయినప్పటికీ అతివిశ్వాసంతో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కేటీఆర్‌ తెరాస నేతలను ఆదేశించారు. మూడు జిల్లాలో ప్రతీ ఓటరును కలిసి తెరాస అభ్యర్ధులకే వారు ఓటు వేసేలా ఒప్పించాలని వారికి కేటీఆర్‌ సూచించారు.

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌3, బిజెపి4ఎంపీ సీట్లు సాధించి చాలా విజయోత్సాహంతో ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రంలో మళ్ళీ బిజెపి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం రాష్ట్ర బిజెపి నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కనుక ఈ ఎన్నికలలో కూడా తెరాసను ఓడించి వారు తమ ఆధిక్యతను చాటుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇప్పటికే ప్రజాసమస్యల కలిసిపోరాడుతున్న ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికలలో తెరాసను ఓడించేందుకు అవసరమైతే నిజామాబాద్‌లోలాగ తెర వెనుక చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. కనుక ఈసారి తెరాస మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ఇక ఎమ్మెల్యేల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికవడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానానికే ఎన్నిక జరుగబోతోంది.

ఆ స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డి, తెరాస ప్రధానకార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పోటీ పడుతున్నారు. వారిలో గుత్తాకే అవకాశం లభించవచ్చునని సమాచారం. ఒకవేళ ప్రతిపక్షాలు తమ అభ్యర్ధిని నిలబెట్టకపోతే ఈనెల 31న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఫలితం ప్రకటిస్తారు లేకుంటే జూన్ 7న ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతిపక్షాలకు ఒక ఎమ్మెల్సీని గెలిపించుకొనేంత బలం లేదు కనుక తెరాస అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టినా గెలుపు లాంఛనప్రాయమే.