ప్రైవేట్ ఫోటోలు డిలీట్ చేయకుండా ఫోన్ అమ్మకం.... ఓ హత్య, మరో ఆత్మహత్య

SMTV Desk 2019-05-27 17:46:12  shubam

గతంలో తన ప్రియురాలితో దిగిన సన్నిహిత ఫోటోలను డిలీట్ చేయకుండా ఓ ఫోన్ ను విక్రయించడంతో, ఈ పరిణామం ఓ హత్యకు, మరో ఆత్మహత్యకూ దారితీసింది. యూపీ రాజధాని లక్నో సమీపంలో ఈ నెల 23న ప్రజాపతి అనే వ్యక్తి దారుణ హత్యకు గురికాగా, కేసును విచారించిన పోలీసులు సంచలన నిజాలను వెలికితీశారు.

శుభమ్ కుమార్ అనే వ్యక్తికి 35 ఏళ్ల వివాహితతో పూర్వ సంబంధాలుండేవి. వీరిద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్నప్పటి తమ చిత్రాలను స్మార్ట్ ఫోన్ లో తీసుకున్నారు. వీటిని తొలగించకుండానే ప్రజాపతికి శుభమ్ కుమార్ తన ఫోన్ ను విక్రయించాడు. ఈ ఫోన్ లోని ఫోటోలను చూసిన ప్రజాపతి వాటిని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న శుభమ్, తన స్నేహితులతో కలిసి ప్రజాపతిని దారుణంగా హత్య చేశాడు.

ఇక తన ప్రైవేటు చిత్రాలు ఇంటర్నెట్ లో కనిపిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు, తన ఐదేళ్ల కుమారుడితో సహా ముజఫర్ నగర్ లోని గంగ్ నహర్ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మహిళ మరణించగా, స్థానికులు ఆమె కుమారుడిని మాత్రం కాపాడారు. ఆత్మహత్యకు ముందు ఆమె తన భర్తతో మాట్లాడిందని, ప్రజాపతి హత్య వెనుక ఆమె పాత్ర కూడా ఉండివుండవచ్చని, ఈ కేసులో శుభమ్ సహా హత్యకు సహకరించిన వారిని అరెస్ట్ చేశామని అన్నారు.