మలింగాపై పూర్తి భారం వేసిన శ్రీలంక

SMTV Desk 2019-05-27 17:39:23  malinga

కొలంబో: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగను నాలుగు నెలల వ్యవధిలో జరిగిన ఎనిమిది వన్‌డే మ్యాచ్‌లలో ఆ జట్టు ఓటమి పాలవడంతో గత ఏప్రిల్‌లో వన్‌డే టీమ్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్ పదవినుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన 35 ఏళ్ల మలింగ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాడు కానీ, ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు ఎవరైనా 35 ఏళ్ల వరకు క్రికెట్‌లో కొనసాగడం చాలా అరుదనే చెప్పాలి. గాయాలు లాంటి వాటి కారణంగా ఫిట్‌నెస్‌ను కొనసాగించడం వారికి చాలా కష్టం. అయితే మలింగ మాత్రం ఇటీవల భారత్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తన సత్తా ఏమిటో చాటి చెప్పాడు. ముంబయి ఇండియన్స్ తరఫున ఆ టోర్నమెంట్‌లో 16 వికెట్లు తీయడమే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఫైనల్ ఓవర్ బౌల్ చేసిన మలింగ అద్భుతం సృష్టించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి జట్టుకు మరపు రాని విజయాన్ని అందించాడు.ఈ నెల 30నుంచి ఇంగ్లాండ్‌లో మొదలయ్యే వన్‌డే ప్రపంచకప్ ముందు అనేక పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇదొక వరమనే చెప్పాలి. జట్టులో ఉన్న బౌలర్లలో చాలా మంది అంతగా అనుభవం లేని వాళ్లే అయిన నేపథ్యంలో వన్‌డేలలో 322 వికెట్లు సాధించిన మలింగ ఆ జట్టుకు కొండంత బలమనే చెప్పాలి. నిజానికి కెప్టెన్సీ కోల్పోవడంతో షాక్‌కు గురయిన తర్వాత మలింగకు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. డొమెస్టిక్ టోర్నమెంట్లలో, ఐపిఎల్‌లో తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయడానికి అతను స్వదేశం, భారత్‌ల మధ్య అనేక సార్లు తిరగాల్సి వచ్చింది. 2014లో శ్రీలంక ప్రపంచ టి 20 టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు మలింగ ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అప్పుడు జట్టులో మహేల జయవర్దనె, కుమార సంగక్కర, తిలకరత్నె దిల్షాన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీళ్లంతా రిటైరయిన తర్వాత కొత్త తరం ఆటగాళ్లు జట్టులోకి రావడంతో మలింగ కెప్టెన్‌గా ఉండడానికి డిమెల్ అంగీకరించలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనసు దెబ్బతిన్న సింహంలాగా ఉన్న ఈ సీనియర్ ఆటగాడినుంచి పూర్తి స్థాయి ఫలితాలను సాధించడానికి అతను జట్టులో అందరితో కలిసి పోయేలా చేయడం జట్టు కొత్త కెప్టెన్ దిముత్ కరుణ రత్నె ప్రధాన బాధ్యతగా మారింది. ఈ మెగా టోర్నమెంట్లలో ఆడేటప్పుడు మలింగ తన ఆట ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తూ ఉండడమే దీనికి కారణం. 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై నాలు గు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడంతో మలింగకు ఒక్కసారిగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది.