ఫించ్ హిట్టర్‌గా ఆడమంటే.. సంతోషంగా ఆడతా: జడేజా

SMTV Desk 2019-05-27 16:04:24  jadeja, icc world cup 2019, team india

ప్రపంచకప్ టోర్నీ ముంది శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (54: 50 బంతుల్లో 6x4, 2x6) అర్ధశతకంతో భారత పరువు నిలిపాడు. కాని ఈ మ్యాచ్‌లో ఆఖరికి భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో ఓడిపోగా.. ఒత్తిడిలో జడేజా ఆడిన తీరుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. స్పిన్నర్‌గా ఇప్పటికే టీమ్‌లో తనదైన ముద్ర వేసిన జడేజా.. ఇటీవలకాలంలో బ్యాట్స్‌మెన్‌గానూ సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన జడేజా.. స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లు ఆడాడు. దీంతో.. ప్రపంచకప్‌ జట్టులో ఫించ్ హిట్టర్‌ పాత్రని పోషిస్తారా..? అని ప్రశ్నించగా.. జడేజా సమాధానమిచ్చాడు. ఇటీవల ఐపీఎల్‌లో జడేజా.. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడిన విషయం తెలిసిందే. ‘టీమ్‌ నన్ను ఫించ్ హిట్టర్‌గా ఆడమంటే.. సంతోషంగా ఆడతాను. ఇది ప్రపంచకప్.. కాబట్టి ఎలాంటి ఒత్తిడి దరిచేరనీయను. ఇటీవల కాలంలో నా బ్యాటింగ్‌కి మెరుగులు దిద్దుకున్నాను. ముఖ్యంగా.. షాట్ సెలక్షన్ విషయంలో ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. నా బ్యాటింగ్‌కి మెరుగుకి ఐపీఎల్‌ కూడా ఓ కారణం’ అని జడేజా వెల్లడించాడు.