ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌ తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారా ?

SMTV Desk 2019-05-27 14:44:33  Etela rajender, TRS, kcr

ఇటీవల హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతీరావు ఫూలే పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. దానిలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో ప్రశ్నించేవారుంటేనే ప్రజలు చైతన్యవంతంగా ఉంటారని, సమాజంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు. అందరూ కలిసి పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చునని అన్నారు.

ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిరాహార దీక్షలను అనుమతించడం లేదు. ధర్నా చౌక్ ఎత్తివేసింది. నిరాహారదీక్షలు చేయబోయేవారిని ముందుగానే అరెస్టులు చేయిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని తెలంగాణ వ్యతిరేకులనో లేక ప్రతిపక్ష పార్టీలకు చెందినవారిగానో ముద్రలు వేస్తోంది. దీనిని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతోందని, మంత్రులు పేరుకే మంత్రులని వారికి తమ శాఖలకు సంబందించి సొంతంగా నిర్ణయాలు తీసుకొనే స్వేచ్చా స్వాతంత్రాలు లేవని ప్రతిపక్షాలు నిత్యం విమర్శలు గుప్పిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి చేస్తున్న విమర్శలనే మంత్రి ఈటల రాజేందర్‌ కూడా అనడం యాదృచ్ఛికమనుకోవాలా లేక సిఎం కేసీఆర్‌ తీరుపట్ల అసంతృప్తితో అన్నారా? అనేది తెలియదు.