జైట్లీ పై పుకార్లు వద్దు

SMTV Desk 2019-05-27 13:29:44  Jaitly, Arun Jaitly

కేంద్రంలో రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి క‌స‌ర‌త్తు మొదలు పెట్టిన సమయంలో గత కేంద్ర కేబినెట్‌లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించిన‌ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. దీనికి అనారోగ్యం కార‌ణంగా కేబినెట్ మీటింగ్‌కు హాజ‌రుకాలేద‌ని స‌మావేశానంత‌రం బీజేపీ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇక మోదీ కేబినెట్‌లో కొన‌సాగ‌క‌పోవ‌చ్చ‌ని కూడా ప్రచారం మొదలయ్యింది. ఈ కార‌ణంగానే బీజేపీ విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాలకు కూడా దూరంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. జైట్లీ అమెరికాలో చికిత్స నిమిత్తం వెళ్లిన‌ప్పుడు పియూశ్ గోయ‌ల్ తాత్కాలిక ఆర్థిక మంత్రిగా కొన‌సాగిన విషయ తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కొత్త కేబినెట్‌లో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిత్వ‌ శాఖ‌ను గోయ‌ల్‌కు కేటాయించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టివేసింది. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వ అధికార ప్రతినిధి సితాన్షుకర్‌ ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు. జైట్లీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, రెండోసారి ఆయన ఆర్థిక శాఖను చేపట్టే అవకాశం లేదంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. చికిత్స కోసం ఆయన అమెరికా లేదంటే బ్రిటన్ వెళ్లే అవకాశం ఉందని వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది.