ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

SMTV Desk 2019-05-27 13:27:50  Jagan, special status

ఢిల్లీలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనికి కలిసిన జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోదీని కలిసిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్‌కు కావల్సిన ప్రత్యేక హోదా విషయం గురించి ప్రస్తావిస్తానని, ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తానని జగన్ అన్నారు.

‘రాష్ట్ర విభజన నాటికి రూ.97 వేల కోట్ల అప్పులుంటే.. ఈ ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అది రూ.2.57 లక్షల కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. అప్పులపై వడ్డీయే దాదాపు రూ.20వేల కోట్లు చెల్లిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్రం సహాయ సహకారాలు అందించాలని కోరాను. దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎన్డీఏకు 250 కంటే ఎక్కువ సీట్లు రావొద్దని నేను దేవుడిని ప్రార్థించాను. ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్ర హక్కు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇక ఎప్పుడూ అది దక్కదు’ అని అన్నారు.

అలాగే ఈ నెల 30వ తేదీన తాను ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని జగన్ పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని, రాష్ట్రంలో కరప్షన్ అనేది ఎక్కడా లేకుండా చేస్తామన్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశానని, ఆయన కూడా ప్రత్యేక హోదాకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పినట్లు జగన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలు కలిసి గట్టుగా పనిచేయాల్సిన అవసరముందని జగన్ అన్నారు.