సరికొత్త రికార్డు సృష్టించిన బుల్లెట్ ట్రైన్

SMTV Desk 2019-05-27 13:02:02  bullet train

బుల్లెట్ రైళ్లకు పుట్టినిల్లయిన జపాన్ మరో కొత్త మోడల్ బుల్లెట్ రైలును పరీక్షించింది. దీని పేరు ఎన్700 సుప్రీమ్. తాజాగా నిర్వహించిన టెస్ట్ రన్ లో సుప్రీమ్ గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి ఔరా అనిపించింది. సుప్రీమ్ ను చాలా తక్కువ బరువుతో, కనిష్ట శక్తి వినియోగంతో, ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. జపాన్ లో భూకంపలు తరచూ సంభవిస్తాయన్న నేపథ్యంలో, భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

కాగా, సెంట్రల్ జపాన్ రైల్వే కార్పొరేషన్ దీన్ని ప్రయోగాత్మకంగా మయబరా, క్యోటో నగరాల మధ్య నడిపి చూసింది. అత్యధికంగా 360 కిమీ వేగం అందుకున్నట్టు గుర్తించారు. బుల్లెట్ షింకాన్సెన్ రైళ్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వేగం అని జపాన్ రైల్వే వర్గాలు తెలిపాయి. జపాన్ లో 1964 నుంచి బుల్లెట్ రైళ్లు వినియోగంలో ఉన్నాయి.