అక్కడ గెలుపే ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతు: బీజేపీ శాఖ

SMTV Desk 2019-05-27 12:35:41  article 370

జమ్మూకశ్మీర్‌ ప్రజలు ఆర్టికల్‌ 370, 35ఏకు వ్యతిరేకంగా ఉన్నారనేందుకు జమ్మూకశ్మీర్‌, లడక్‌ ప్రాంతాల్లో బీజేపీ గెలుపు సాధించడమే సాక్ష్యమని, అందువల్ల ఎన్‌సీపీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌‌ ప్రజలకు ఆర్టికల్‌ 370, 35ఏ వల్ల ప్రత్యేక ప్రతిపత్తి లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్టికల్స్‌ రద్దు చేయాలన్నది బీజేపీ యోచన. అయితే దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనిల్‌గుప్తా స్పందిస్తూ జమ్ము, లడక్‌ ప్రాంతాల్లోని మూడు ఎంపీ సీట్లు బీజేపీ గెల్చుకుందంటే ఈ ఆర్టికల్స్‌ రద్దుకు ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లే భావించాలన్నారు. అత్యధిక ఓట్లు కూడా (46.4 శాతంతో తొలిస్థానం) బీజేపీయే దక్కించుకుందని గుర్తు చేశారు.

దీంతో ఈ విషయంలో అక్కడి ప్రజలకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీపై నమ్మకం లేదని అర్థమవుతోందని చెప్పారు. ఇక్కడి ఐదు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 7.89 శాతం, పీడీపీ 2.4 శాతం ఓట్లు సాధించడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370, 35ఏను రద్దు చేస్తామని ప్రకటించిన విషయం గమనార్హం.