హీరోయిన్ తలకు తుపాకీ గురిపెట్టి పెళ్లి చేసుకోవాలని డిమాండ్

SMTV Desk 2019-05-26 17:20:28  reethu singh

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ హీరోయిన్ తలకు తుపాకీ గురిపెట్టి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ అభిమాని కారణంగా వారణాసిలోని రోబర్ట్స్ గంజ్ ప్రాంతంలో ఉన్న హోటల్ లో దాదాపు గంటన్నర పాటు హైడ్రామా నడిచింది. ఈ హోటల్ లో బస చేసిన ఓ భోజ్ పురి హీరోయిన్ తలకు తుపాకిని గురిపెట్టి, తనను వెంటనే వివాహం చేసుకోవాల్సిందేనని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. అయితే అతను చంపుతానని బెదిరించిన వివాహానికి ఆమె ఏ మాత్రం అంగీకరించలేదు. జానుపూర్ ప్రాంతానికి చెందిన పంకజ్ యాదవ్ తనకు దగ్గర్లోని హోటల్ లో తన అభిమాన నటి ఉందని తెలుసుకుని వచ్చాడు.

నిందితుడు నివసించే ప్రాంతానికే చెందిన రీతూ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ, భోజ్ పురి చిత్రాల్లో నటిస్తోంది. తుపాకితో హోటల్ లోకి వచ్చిన పంకజ్, ఆమె ఉన్న ప్రాంతానికి చేరుకుని బెదిరింపులకు దిగాడు. వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని తలకు తుపాకిని గురి పెట్టడంతో ఆమె భయభ్రాంతులకు గురైంది. ఘటనను గమనించిన అశోక్ అనే స్థానిక యువకుడు అడ్డుకోబోగా, పంకజ్ ఫైరింగ్ ఓపెన్ చేశాడు. దీంతో అశోక్ కు బులెట్ గాయమైంది. తుపాకి శబ్దాన్ని విన్న హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఎస్పీ జాఫర్ తేజ్ పాటిల్ పంకజ్, రీతూ ఉన్న గదికి చేరుకుని అతన్ని లొంగిపోవాలని హెచ్చరించారు. అయినా వినని పాటిల్, ఎస్పీవైపు, రీతూ వైపు తుపాకిని గురిపెడుతూ, కాల్చేస్తానని హెచ్చరికలకు దిగాడు. ఆపై దాదాపు గంటన్నర పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు కౌన్సెలింగ్ చేస్తూ, నెమ్మదిగా మాటల్లోకి దింపి, పంకజ్ తుపాకిని లాగేసుకునే ప్రయత్నం చేయగా, ఆ సమయంలో మరో బులెట్ ను పేల్చాడు. ఎట్టకేలకు ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.